"ఈదేశానికింత చెడ్డ పేరు రావటానికి కారణం మీరా మేమా? ఆలోచించుకోండి. ఒకప్పుడిది మంచి దేశమని లోకానికి తెలుసు. మళ్ళీ దీనికి మంచి పేరు రావాలి. ఇంత అపఖ్యాతికి కారణం ఎవరు? - టటాంకా యెటాంకా, రెడ్ ఇండియన్స్ నాయకుడు పంజాబ్‌లో అకాలీద ళ్‌ని బలహీన పర్చటానికి నెహ్రూ కాలం నుంచి అనేక ప్రయత్నాలు జరిగాయి. 1980 ప్రథమార్ధంలో ఇందిరాగాంధీ అకాలీదళ్ కంటిని సిక్కుల కత్తితో పొడవటానికి భింద్రన్‌వాలేని బలోపేతం చేశారు.

1984లో భింద్రన్‌వాలే అమృత్‌సర్‌లోని స్వర్ణాలయాన్ని ఆయుధాగారంగా మార్చివేశాడు. ఇందిరా గాంధీ విజ్ఞప్తులు, ఆదేశాలనుఖాతర్ చేయలేదు. దీంతో అతనికి వ్యతిరేకంగా ఇందిర ''ఆపరేషన్ బ్లూస్టార్'' నిర్వహించారు. ఆ సైనిక చర్యలో భింద్రన్‌వాలే హతమయ్యారు. తిరిగి భింద్రన్‌వాలే శక్తి ఇందిరని హతమార్చింది. గల్లీల్లో గూండాలను తయారుచేస్తుందని, మాఫియా గ్యాంగుల్ని పెంచి పోషిస్తుందని తమ కనుకూలంగా పనిచేస్తే ఫ్రీడమ్ ఫైటర్స్ అని, వాళ్ళే విభేదిస్తే టెర్రరిస్టులుగా నామాంతరం చెందుతారని, ఎంతటి నీచానికైనా దోపిడి పాలక వర్గాలు పాల్పడతాయనే విషయాన్ని ఇందిరాగాంధీ నిరూపించారు.

1979లో సోవియట్ సైన్యాలు అఫ్ఘానిస్తాన్‌ను ఆక్రమించాయి. రష్యన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న అఫ్ఘాన్ ముజాహిద్దీన్‌లకు అమెరికా సహాయం చేయటం మొదలుపెట్టింది. ఫ్యూడల్ దొరలు ఒక్కోసారి గొప్పలు పోవడానికి, తమపేరు శాశ్వతంగా నిలబడడానికి ఉదారంగా సహాయం చేస్తారు. కానీ పెట్టుబడిదారుడు ఎట్టి పరిస్థితుల్లోనూ లాభం లేకుండా సహాయం చేయడు. అమెరికా లాంటి విధ్వంసక కాపిటలిజం చేసిన రహస్య సహాయం 300 కోట్ల డాలర్లు.

అంటే 15,000 కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అఫ్ఘానిస్తాన్‌లో అప్పుడు సి.ఐ.ఎ ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మిల్టన్ బియార్డన్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. రష్యన్లకు వ్యతిరేకంగా, 3 బిలియన్ డాలర్ల సహాయం అందించే ఉదార స్వభావం అమెరికా పెట్టబడిదారుల కెందుకుంది? కత్రినా సైక్లోన్‌లో తిండి దొరక్క తంటాలు పడ్డ న్యూఆర్లియన్స్ ప్రాంత అమెరికన్ పౌరులకే రొట్టె ముక్కలు కూడా ఉచితంగా అందివ్వని అమెరికన్ పాలకవర్గం అంత పెద్ద మొత్తాన్ని అఫ్ఘాన్‌లో పోరాడుతున్న ముజాహిద్దీన్‌లకు ఎందుకు ఖర్చు పెట్టినట్టు? ఒసామాబిన్ లాడెన్ అపుడు అఫ్ఘాన్ల తరపున అఫ్ఘానిస్తాన్ లోనే పోరాడుతున్నాడు! ఒసామాని అఫ్ఘాన్ ప్రజలు 'పవిత్ర మానవుడు' అని పిలుచుకుంటున్నారు.

ఆ 3 బిలియన్ డాలర్లు ఒసామాకి అందజేయలేదని, 'ఆ రహస్య సహాయాన్ని' ఒసామా అందుకోలేదని చరిత్రలో సాక్ష్యాలు దొరకుతాయా? ఈ రోజు కాకపోతే రేపైనా! సరే, ఒసామా గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మహ్మద్ అపద్ బిన్ లాడెన్ అనే యెమన్ దేశస్థుడుకి ఎలియా ఘానెమ్ అనే సిరియా దేశస్థురాలికి 1957, మార్చి 10న సౌది అరేబియాలోని రియాద్‌లో పుట్టిన ఏకైక సంతానం ఒసామా. సముద్రతీరంలోని పోర్టులో కూలీ పనిచేసిన అపద్ బిన్ లాడెన్ సౌదీకి వచ్చి మక్కా మదీనాలకు మరమ్మత్తు, సౌదీ రాయల్ ప్యాలేసులను అతి తక్కువ ఖర్చుతో కట్టి, సౌదీ రాజ కుటుంబాలకు అతి సన్నిహితంగానే కాదు, సౌదీ రాజరిక వ్యవస్థలో మంత్రిగా కూడా పనిచేసాడు.

సౌదీలోనే అతిపెద్ద నిర్మాణరంగ కంపెనీకి అధిపతి అయి, అతికొద్దిమంది ధనికుల్లో ఒకడైనాడు. ఒసామాకి రెండు సంవత్సరాల వయస్సున్నపుడే తల్లిదండ్రులు విడిపోయారు. ప్రఖ్యాతిగాంచిన అల్ ధాగర్ మోడల్ స్కూలులో చదువు. ఆ తరువాత ఇంజనీరింగ్ చేసిన ఒసామా ప్యూర్ ఇస్లామ్‌కి (సౌభ్రాతృత్వానికి) విధేయుడుగా పెరిగాడు. 14 సంవత్సరాల వయస్సులోనే ఖురాన్ మత గ్రంధాన్ని కంఠస్తం చేసి, లైఫ్‌స్టైల్‌లో, డ్రెస్‌కోడ్‌లో మహమ్మద్ ప్రవక్తని అనుకరించిన మితభాషి.

స్కూల్‌లో, కాలేజీలో అవుట్ స్టాండి ంగ్ విద్యార్థిగా పేరు పొందాడు ఒసామా. తన తండ్రి వ్యాపార లావాదేవీల కారణంగా, ఆయన ప్రతి సంవత్సరం ఆర్గనైజ్ చేసే హాజ్ యాత్రల వలన కూడా అరబ్ ప్రపంచంలోని ధనికులతో, ఇస్లామిక్ స్కాలర్స్‌తోనూ ఒసామాకి పరిచయాలేర్పడ్డాయి. మితభాషి, ఇస్లామిక్ నియమనిష్ఠలతో పెనవేసికొని పోయిన ఈ బక్క పల్చటి వ్యాపారస్తుడిని 1979లో అఫ్ఘానిస్తాన్‌లోకి దూసుకు వచ్చిన రష్యన్ సోషల్ ఫాసిస్ట్ సేనల దుశ్చర్యలకు బలైపోతున్న తోటి అఫ్ఘాన్ ముస్లిమ్ ప్రజల కష్టాలు, కన్నీళ్ళు కదిలించి వేసాయి.

అదే సమయంలో తోటి ముస్లిమ్ సహోదరులకు సాయం చేయమని సౌదీ రాజుల్ని అర్ధించి, విఫలమవుతున్న క్రమంలో శవాల్ని పీక్కుతినే రాబందులుగా ఎదురుచూస్తున్న అమెరికా ( తన జాతీయ జెండాలో రాబందు (ఈగిల్)నే సింబాలిక్‌గా పెట్టుకుంది!) రహస్య పోలీస్ (సిఐఏ , నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా) అఫ్ఘాన్‌లోని తిరుగుబాటుదారులకి 'రహస్య సహాయంగా 3 బిలియన్ డార్లని అందించటానికి తయారుగా కాచుక్కూచుంది.

ముల్లా ఒమర్ నాయకత్వంలోని ముజాహిద్దీన్లకి ఈ రహస్య సహాయాన్ని అందించిందని, అప్పుడే ఎదుగుతున్న, పెరుగుతున్న ఒసామా బిన్ లాడెన్ గురించి అమెరికన్ గూఢాచారులకు, వాళ్ళ వాషింగ్టన్ బాస్‌లకు తెలియదని, ప్రపంచ రాజకీయ పరిజ్ఞానం కొంచెమైనా ఉన్న వాళ్ళకు అర్థం కాదనటం పిల్లి పాలు త్రాగుతూ... అన్నట్లుంటుంది. ఈ విషాయాన్ని సి.ఐ.ఎ. ఆఫీసర్ మిల్టన్ బియార్డాన్ ధ్రువీకరించాడు కూడా.అఫ్ఘాన్ యుద్ధ శరణార్థులకు సౌదీ రాజులు సహాయం నిరాకరించిన తర్వాత చాలామంది ఉలేమాలు (ఇస్లామిక్ స్కాలర్స్) ఒసామా సహాయ ప్రతిపాదనలను అంగీకరించి, మద్దతు పలికారు.

అఫ్ఘాన్ ముస్లిమ్ అనాధల కొరకు రక్షణ వలయాన్ని, సౌదీ, సూడాన్, ఈజిప్ట్ తదితర దేశాల ముజాహిద్దీన్లతో ఏర్పర్చాడు ఒసామా. 1989లో రష్యన్ సైన్యాలు అఫ్ఘానిస్తాన్ నుండి వైదొలగిన తరువాత యుద్ధ భూమిలో ఒసామా అనుభవాలు, తన వ్యాపారాలను లక్ష్య పెట్టక అసలైన ఇస్లామ్‌లోని సౌభ్రాత ృత్వానికి (బ్రదర్‌హుడ్)కి అంకితమయ్యాడు. పిల్లికి పిల్లికి మధ్య పోరుపెట్టిన.. చందంగా అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా అవలంబిస్తున్న నీతి మాలిన దౌత్యాన్ని అర్థం చేసికొన్నాడు. అమెరికా పట్ల, ద్వేషం పెంచుకున్నాడు.

పది సంవత్సరాలు కొనసాగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలోను, పాకిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని పెంచిపోషించటంలోను, లాటిన్ అమెరికన్ దేశాల్లో ప్రజాద్రోహుల్ని తమ కీలు బొమ్మలుగా ప్రతిష్ఠించి, ఆయా దేశాల్లోని సహజ సంపదల్ని దోచుకొని, జాక్ లండన్ తన "ఉక్కుపాదం'' పుస్తకంలో వివరించినట్లు, అమెరికన్ కార్మికులకి అధిక మొత్తంగా జీతాలు చెల్లిస్తూ ప్రపంచ దేశ ప్రజల్ని తన పాదాక్రాంతం చేసికొనే ప్రణాళికలో ఇదంతా భాగమేనని ఒసామా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తుంది.

అమెరికన్ పాలకులు 1990 నుంచి ఒక వింతైన సిద్ధాంతాన్ని ప్రచారంలో పెట్టారు. 'మేము (అమెరికా) ప్రపంచంలో ఎక్కడైనా, ఏ దేశాన్నైనా ప్రజాస్వామ్యం ముసుగులో దోచుకునే అర్హత మాకు ఉన్నది. మాకు మద్దతిచ్చే దేశాలు మాకు మిత్రులు, కాదన్నవాళ్ళు ఉగ్రవాదులు'' అనేదే ఆ సిద్ధాంతం. ఇదీ అమెరికన్ ఇంపీరియల్ టెర్రరిస్టుల అంతర్జాతీయ దౌత్యనీతి. ఇది ఎలా ఉన్నదంటే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రజలకి ఒక స్పష్టమైన తాఖీదులిచ్చింది.

"ఉంటే సల్వాజుడుంలో సభ్యులుగా ఉండండి. లేదంటే మీరంతా మావోయిస్టులే. కాబట్టి మీరు చంపబడడానికి, రేప్ చేయబడడానికి మీ గూడేలు, గుడిసెలు తగలబెట్టబడటానికి అర్హత పొందుతారు'' అన్నది. మాకు బతకటానికి స్వేచ్ఛ కావాలనే ప్రతి ఒక్కడు, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి, టెర్రరిస్ట్‌గానో, మావోయిస్టుగానో కనపడతాడు. కాషాయ వస్త్రధారుడైన స్వామి అగ్నివేష్ కూడా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి మావోయిస్టుగానే కనపడినందు వల్లనే ఆయన మీద దాడి జరగడం గమనించాలి.

రష్యన్లు అఫ్ఘానిస్తాన్‌పై చేసిన దాడిని సాకుగా తీసుకొని అమెరికన్ గూఢచారి వ్యవస్థ "ఆపరేషన్ సైక్లోన్'' పేరుతో అఫ్ఘాన్ తిరుగుబాటుదారులకి 3 బిలియన్ డాలర్ల రహస్య నిధిని ఏర్పాటు చేసింది. అప్పటికే అఫ్ఘాన్ నాయకుల మీద నమ్మకం సడలిన ఒసామా తన పవిత్ర యుద్ధాన్ని (జిహాద్) ప్రారంభించాడు. అప్పుడు అమెరికన్ గూఢచారి వ్యవస్థలు (సి.ఐ.ఎ., అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలు) ఒసామా లాంటి కాబోయే ప్రపంచ ఉగ్రవాదిని వదులుకుంటాయా? ఇందిరాగాంధీ భింద్రన్‌వాలేని ఒదులుకోనట్లు, అమెరికా 1980లో ఒసామాకి కావల్సినంత సహాయం చేసి, రష్యన్ సైన్యాలు 1989లో అఫ్ఘానిస్తాన్‌ని వదిలిన తర్వాత గల్ఫ్‌లోని ఇరాక్, కువైట్ ప్రాంతాల్లోని చమురు నిక్షేపాల్ని దోచుకోవటానికి ఉపయోగించుకుందామనుకుంది.

ఒకవైపున ఇజ్రాయేల్‌ని ముస్లిమ్ దేశాలపైకి ఉసిగొల్పుతూ, మరోవైపు సౌదీ అరేబియా రాజరిక వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని, ఇరాక్‌లో సద్దాంని శిక్షించటానికి ఒసామాని ఉపయోగించుకుందామనుకుంది అమెరికా. కానీ ఒసామా అమెరికాని ధిక్కరించాడు. అఫ్ఘాన్‌లో 1982-89 వరకు ముజాహిద్దీన్‌లకు సహాయపడ్డ ఒసామా 1986లో తన పర్యవేక్షణలో పనిచేసే జిహాద్‌ని ప్రార ంభించాడు. 1988 నాటికి అల్‌ఖైదా, అంటే 'ది బేస్' అనే అంతర్జాతీయ జిహాది సంస్థను ఏర్పర్చాడు.

అఫ్ఘానిస్తాన్ నుంచి సోవియట్ సైన్యాలు వైదొలిగిన తరువాత సౌదీకి ఒబామా వెళ్తే అమెరికన్ పాలకుల ఆదేశాల మేరకు సౌదీ రాజరిక వ్యవస్థ ఒసామాని హౌజ్ అరెస్ట్ చేసి, అతని అంతర్జాతీయ ప్రయాణాల్ని నిషేధించింది. అతని జిహాద్‌లో ఎక్కువమంది సౌదీ అనేబియన్‌లు, ఈజిప్షియన్‌లు, యెమెన్, లిబియా, సూడానీయులు, అఫ్ఘాన్లు, పాకిస్తానీయులు, కాశ్మీరీలు, ఇండియన్లు ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత హింసాత్మక సంఘటలకు పాల్పడుతుంది అమెరికానే అని 40 సంవత్సరాల క్రితమే నల్లజాతీయుల నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అమెరికా గడ్డ మీదనే నిలబడి నిలదీశాడు. రూజ్‌వెల్ట్, కెనడీ, జిమ్మి కార్టర్ నుంచి రోనాల్డ్ రీగన్, జార్జిబుష్ సీనియర్, బిల్ క్లింటన్, బుష్ జూనియర్, యిపుడు ఒబామా, ఎవరైతేనేమి ఒక్కొక్కడు మహా హంతకుడనే విషయాన్ని చరిత్ర రికార్డు చేస్తూనే ఉంది. అనేక వందల వేల యుద్ధాల్ని చూచిన ప్రపంచ ప్రజల చరిత్ర ఇప్పుడు ప్రశ్నిస్తుంది.

హంతకులెవరు? నరహంతకులు ధరాధిపతులైన వేళ గౌతమ బుద్ధులకి, ఏసుక్రీస్తులకి స్థానమెక్కడ ఉంటుంది? అణిచివేత నుంచి నిరాశ, నిరాశ నుంచి నిరసన, నిరసన నుంచి ధిక్కారం, ధిక్కారానికీ దిక్కు లేకపోతే.. ? టెర్రరిజమే దిక్కవతుందన్నది గతి తర్కం. ఒసామా విషయంలో హంతకుడు ఒక నామవాచకాన్ని మాత్రమే రూపుమాపాడు; ఆ హతుడు సర్వనామమనే విషయాన్ని విస్మరించాడు. ఇది చాలు హంతక అమెరికాకు మరో భంగపాటు సమీప భవిష్యత్తులో కలగటానికి..