ఆ సభలో ఒక ఆర్.ఎస్.యు. రాష్ర్ట కార్య నిర్వాహక కమిటీ సభ్యు డు ‘రిజర్వేషన్లపట్ల మీ అభిప్రాయం ఏమిటి’ అని ప్రశ్నించాడు. ‘రిజర్వేషన్లని సపో ర్టు చేయనివారు కమ్యూనిస్టులు అనుకోవటం లేదు’ అన్నాను. ఈ అభిప్రాయం మీదా లేక ఆర్.ఎస్.యు.దా? అన్నాడా సభ్యుడు. ‘ఆర్.ఎస్.యు. జనరల్ సెక్రెట రీగా ఈ విషయం చెబుతున్నాను. నా ఈ అభిప్రాయాన్ని ఆర్.ఎస్.యు. స్వంతం చేసికొంటే ఆర్.ఎస్.యు.అభిప్రాయం అవుతుంది,లేదంటే నా అభిప్రాయం అవుతుంది’ అన్నాను.అపుడు చర్చ తెగేదాకా లాగవద్దనే సలహామేరకు చర్చ ఆపుచేసాము.
కమ్యూనిస్టు పార్టీల్ని (పార్లమెంటరీ), విప్లవ పార్టీల్ని నడిపించే నాయకత్వాల్లో ఆయా పార్టీలకు అనుబంధంగా ఉన్న మేధావి వర్గం, ఈ దేశ వాస్తవ సామాజిక జీవితాన్ని సరిగ్గా అంచనా వేసి, కనీసం 1990 నుండి ‘కులాన్ని’ గుర్తించినటై్లనా- 1930 నుండి గుర్తించ గలిగినట్లయితే, దోపిడీ కులాల పునాది నుండి వచ్చిన వామపక్ష మేధావుల పట్ల దళిత మేధావుల స్పందన సానుకూలంగా ఉండేదేమో! ఇకనైనా వీరు నిర్వహించవలసిన దిక్సూచి పాత్రనుండి (వ్యాన్‌గార్డ్) తప్పుకొని అనుకరణ స్థాయికి దిగిన వైనాన్ని విశ్లేషించుకోవాలి. మొదట కుల సమస్య లేదన్న వాళ్ళు, తరువాత కుల సమస్య కేవలం మానసిక ప్రవృత్తి, అంటే ‘కులం ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు’ అన్నారు.
‘కులం కేవలం ఉపరితల సమస్యే, పునాది కాదు’ అన్నారు. ఆ తరువాత- ‘కులం’ అనేది పునాది, ఉపరితలం రెండూ’ అన్నారు. భారత దేశం అంటే ‘కులం’, ‘మనవాడు’, ‘మనోడేనా’ అనే స్పష్టమైన విభజన కనిపిస్తుంటే, 90 సంవత్సరాల నుండి ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడన్నట్లు’ వామపక్షాలు ప్రవర్తిస్తుంటే ఏమనుకోవాలి? 2010 అక్టోబర్ 25న ప్రఖ్యాత మార్క్సిస్టు చరిత్ర కారుడు విక్టర్ కీర్నన్ సంస్మరణార్థం బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన లెసన్స్ ఆఫ్ ఎంపైర్ (సామ్రాజ్య పాఠాలు) సదస్సులో ప్రసంగిస్తూ సి.పి.ఎం.
పార్టీ జాతీయ కార్యదర్శి ‘కులం గురించి పట్టించుకోక పోవడం కమ్యూనిస్టుల చారిత్రక తప్పిదం’ అన్నవాడు- 24 గంటలు దాటక ముందే నిన్నటి మాటను దాటవేశాడు. వీళ్ళలో మార్క్సిజం కన్నా మనువాదం పాలు ఎక్కువ ఉందనుకోవడంలో దళిత మేధావుల తప్పుందా? కులం ప్రాముఖ్యత గురించి నాకు అర్థమైనంత వరకు వామపక్ష నాయకత్వానికి, మేధావులకి అర్థం కాక కాదు. వారి కుల దోపిడీకి గురై, అడుగడుగునా అడ్డంకుల్ని దాటుకొని, విద్యావంతులమై, అతి కష్టం మీద సంపాదించుకున్న అనుభవజ్ఞానాన్ని, మాతో కలిసి పనిచేసిన, చేస్తున్న వ్యక్తుల, సంస్థల ఉద్యమాల, ప్రతికూల పరిసర ప్రభావాల ఫలితంగా, మాకొచ్చిన అంచనాల ఫలితమే, మా అభిప్రాయం.
అణచివేతకు గురైన కులాలకు, నేడు ఈ మాత్రమైనా బతుకు భరోసా ఉందంటే, మూడు సంస్థల కృషి ఫలితమని 1991 అక్టోబర్ 1న ఖమ్మంలో ప్రభుత్వం నిర్వహించిన ఖమ్మం జిల్లా ఆవిర్భావ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రకటించాను. అవి- క్రిస్టియానిటీ (అంటరాని వాళ్ళతో కరచాలనం, దేవుడిని చూప నిరాకరణకు గురైన వాళ్ళకి ప్రత్యామ్నయ దేవుడిని చూపించడం), బి. ఆర్. అంబేడ్కర్(జ్ఞాన సముపార్జనకు మార్గాన్ని చూపాడు), వామపక్ష విప్లవ సంస్థలు (ప్రశ్నించి, ఎదిరించి నిలబడే ధైర్యాన్నిచ్చాయి).
ఫూలే- వామపక్ష మేధావులు: బాబా సాహెబ్ అంబేడ్కర్‌ని బ్రిటిష్ ఏజెంటన్న మార్క్సిస్టు మేధావులు మహాత్మా ఫూలేని ఎందుకు విస్మరించారు? రాజారామ్ మోహన్ రాయ్‌ని, కందుకూరి వీరేశలింగం పంతుల్ని, గురజాడ అప్పారావుని, గాంధీని, నెహ్రూని చివరకు ఎమర్జెన్సీ విధించి పౌరహక్కుల్ని హరించిన ఇందిరా గాంధీని కూడ పొగిడిన వామపక్ష మేధావులు, నాయకులు ఫూలేను గురించి, కనీసం చర్చలోకి కూడ ఎందుకు తీసికొని రాలేదు? విదేశీయులైన రోజలిండ్ ఓ హాలన్, గెయిల్ ఓంవెత్‌ల పరిశోధనల మూలంగా, బహుజన సమాజ్ పార్టీ, బహుజనులు నడిపిన ‘నలుపు’ పత్రిక ద్వారానే తెలుగు నాట ఫూలే గురించి, ఆయన నడిపిన పోరాటాల గురించి, బ్రాహ్మణిజం విష సంసృ్కతి గురించి దేశానికి తెలిసింది కాని, ఏ ఒక్క మార్క్సిస్టు నాయకుడు, మేధావి ఈ పనికి పూనుకున్నాడా? ఈ వ్యతిరేకతను ఏమనాలి?
ఈ దేశంలో మార్స్కిజం మనువాదానికి, బ్రాహ్మణిజానికి దాసోహమన్నదనాలా, మార్క్సిజం ముసుగేసుకున్న మనువాదం- మార్క్సిజాన్ని మింగేసిందనాలా? భారత దేశ చరిత్ర, స్వాతంత్య్ర ఉద్యమాలు, హేతువాదం, భౌతికవాదం- ఇలా అనేక విషయాల మీద ఉపన్యాసాలిచ్చే వీరు ఫూలే గురించి మాట్లాడలేదెందుకు? వామపక్ష మేధావులు డి.డి. కోశాంబి, బిపిన్ చంద్ర, రాహుల్ సాంకృత్యాయన్, ఆర్.ఎస్. శర్మ- వీరెవరికి ఫూలే గురించి తెలి యదనుకోవాలా? ఆంధ్ర రాష్ర్టంలోని, చరిత్రకారులు, విప్లవ కవులు, మేధావుల దృష్టిలో ఫూలే పోరాటాలు అభివృద్ధినిరోధక పోరాటాలా? బ్రాహ్మణిజంలో నిశ్శబ్ద హత్యే ఒక ఆయుధం.ఈ సైలెంట్‌కిల్లింగ్‌లో వామపక్ష మేధావులు భాగస్వాములై నారనటానికి ఫూలేఉదంతం ఒక సాక్ష్యం. ఇందుకు కారణం ఫూలే బ్రాహ్మణిజాన్ని, వేదాల్ని, వాటి ప్రమాణాల్ని,వాటి క్రిమినల్ మనస్త త్వాన్ని బట్టబయలు చేశాడు. అందుకే ఈ హిందూ కమ్యూనిస్టు మేధావులకి ఫూలే అంటే అంత కక్ష.
అంబేడ్కర్- వామపక్ష మేధావులు: సాధారణంగా వ్యక్తులపట్ల, సంస్థలపట్ల తప్పుడు నిర్ణయాలు చేసేవాళ్ళకి ఎక్కువ కారణాలు తెలిసి ఉండాలి. కానీ అంబేడ్కర్‌ని- కుల వ్యవస్థ, దాని ఆవిర్భావం, కొనసాగింపుకు దోహదపడే అంశా ల్ని పరిశీలించటంలో వామపక్ష మేధావులకి గాని, వామపక్ష పార్టీలకిగాని సరైన అవగాహనకి రావడానికి అవసరమైన సమాచారం కోసం ప్రయత్నించినట్లు లేదు. ఒక వ్యక్తి, ‘పుట్టుక తోటే ప్రతిభావంతుడు’ అనే సిద్దాంతాన్ని మార్క్సిజం కాని న్యూరో సైన్సెస్ కాని ఒప్పుకోవు. అదేవిధంగా ‘వైరుధ్యాలు’ తెలిసికొని, పరిష్కరించడంలో మావో ఆలోచనను గాని, మావోయిజాన్ని గాని అవగాహన చేసికొన్నవాడైతే, ‘లెనిన్ ఇండియాలో పుడితే గాంథీ అయ్యేవాడని, గాంథీ రష్యాలో పుడితే లెనిన్ అయ్యేవాడనే నిర్ణయానికి,భగవత్గీతలో మార్క్సిజం ఉంది’ అనే తప్పుడు నిర్ణయాలకి కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకుడు శ్రీపాద అమృత డాంగే రాడు.
మద్రాసు రాష్ర్టంలో, దేశ వ్యాప్తంగా బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలను (ఉదా:పెరియార్, నారాయణ గురు, అంబేడ్కర్) బ్రాహ్మణ నాయకత్వానికి వ్యతిరేకంగాను, వారి ఎదుగుదలను ఓర్వలేకనే బ్రాహ్మణే తరులు నిర్వహిస్తున్న ఉద్యమాలుగా ను డాంగే చిత్రీకరించారు. ఈ దేశ మూల వాసుల తిరుగుబాట్లు, చార్వాక, బౌద్ధ తాత్త్విక విచారణలు, ఉద్యమాల గురించి గాని, తద్విరుద్ధమైన రామాయణ, భారత, భగవత్ గీతల్లోని శ్రామిక కులాల వ్యతిరేక తాత్త్విక ఆలోచన్లను గురించి గాని వీరు ఏనాడు శాస్త్రీయంగా విశ్లేషించి చర్చించలేదు.
సి.పి.ఎం. పార్టీ సీనియర్ నాయకుడు, కేరళ రాష్ర్ట వామపక్ష పార్టీ ప్రథమ ముఖ్యమంత్రి ఇ.ఎమ్.ఎస్. నంబూద్రి పాద్‌కు అంబేడ్కర్ పట్ల ఎంత తిర స్కార, వ్యతిరేక భావం ఉందంటే- తను రాసిన ‘భారత స్వాతంత్య్ర పోరాట చరిత్ర’ అనే పుస్తకంలోని 773 పేజీల్లో కనీసం రౌండ్ టేబుల్ సమావేశాల్లో గాని, రాజ్యాం గ పరిషత్తులో గానీ అంబేడ్కర్ ప్రసక్తి లేకుండా, రాకుండా జాగ్రత్త పడ్డారు. వైస్రా య్ కౌన్సిల్లో, అంబేడ్కర్ సభ్యునిగా చేరినందుకు సామ్రాజ్యవాదుల ఏజెంట్ అని, విప్లవ ద్రోహి అని నిందించారు అప్పటి కమ్యూనిస్టు నాయకులు.
అంబేడ్కర్ ఉద్య మాన్ని వామపక్ష నాయకులు, మేధావులు, చరిత్రకారులు కూడా ‘జాతీయోద్య మాన్ని బలహీన పరిచే చీలిక ఉద్యమంగా, ప్రమాదకరమైన బ్రిటిష్ అనుకూల ఉద్యమం’(భారతదేశ స్వాతంత్రోద్యమం 1857-1947, బిపిన్ చంద్ర పాల్ (1989)గా చిత్రించారు. అంబేడ్కర్ విషయంలో ఇప్పటికీ పార్లమెంటరీ కమ్యూ నిస్టు పార్టీల నుండి విప్లవ కమ్యూనిస్టు పార్టీల వరకు వేస్తున్న అంచనాలు దోపిడీ కుల కంపు కొడుతున్నాయి.
ఆ కంపుని దాచుకొనే ప్రయత్నమే వీరు తగిలిం చుకున్న మార్స్కిజం బురఖా. వీరు వల్లించే ‘సోషలిజం’ వీరి ‘కులం పెట్టుబడికి’ ఒక రక్షణ కవచం. అంబేడ్కర్ సిద్ధాంతం, ఆచరణ, ఉద్యమాల గురించి హిందూ కమ్యూనిస్టుల అభిప్రాయాలు చూడండి: 1976-77 ల్లో సి. పి. ఐ. (ఎం. ఎల్) వినోద్ మిశ్రా గ్రూప్ ఒక డాక్యుమెంట్‌ను మూర్తి అనే ఆంధ్రా నాయకుడి ద్వారా ఉస్మానియా మెడికల్ కాలేజీలోని వామపక్ష విద్యార్థుల్లో అంబేడ్కర్ మీద చర్చకు పెట్టారు. అందులో అంబేడ్కర్ కులతత్వవాది అనీ, బ్రిటిష్ ఏజంట్ అనీ రాశారు.