Total Pageviews

Monday, November 8, 2010

దళిత మేధావులు - వామపక్ష మేధావులు-2


వామపక్ష శిబిరంలో రిజర్వేషన్ల అనుకూల, వ్యతిరేక వర్గాలు ఉన్నాయి. అణచివేతకు గురైన కులాలకు కల్పించే రిజర్వేషన్ల పట్ల కొన్ని వామపక్షాలకు అభ్యంతరం ఎందుకుండాలి? ట్రేడ్‌ యూనియన్లు పెట్టి కార్మికులకు ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పించాలని, జీతాలు పెంచాలని, బోనస్‌లు ఇవ్వాలని, వారి పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించాలని పోరాటాలు చేసే వామపక్ష పార్టీలు వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు అయిన దళితులకు ఇచ్చే రిజర్వేషన్ల పట్ల వీళ్ళకి ఎందుకు ఈ కుళ్ళుబోతుబుద్ధి? దీన్ని మనువాదం అంటారా, మార్స్కిజం అంటారా? 1982 లో ఆర్‌.ఎస్‌.యు. రాష్ర్ట మహాసభలు గుంటూరు జిల్లాలో జరు గుతున్నాయి.

ఆ సభలో ఒక ఆర్‌.ఎస్‌.యు. రాష్ర్ట కార్య నిర్వాహక కమిటీ సభ్యు డు ‘రిజర్వేషన్లపట్ల మీ అభిప్రాయం ఏమిటి’ అని ప్రశ్నించాడు. ‘రిజర్వేషన్లని సపో ర్టు చేయనివారు కమ్యూనిస్టులు అనుకోవటం లేదు’ అన్నాను. ఈ అభిప్రాయం మీదా లేక ఆర్‌.ఎస్‌.యు.దా? అన్నాడా సభ్యుడు. ‘ఆర్‌.ఎస్‌.యు. జనరల్‌ సెక్రెట రీగా ఈ విషయం చెబుతున్నాను. నా ఈ అభిప్రాయాన్ని ఆర్‌.ఎస్‌.యు. స్వంతం చేసికొంటే ఆర్‌.ఎస్‌.యు.అభిప్రాయం అవుతుంది,లేదంటే నా అభిప్రాయం అవుతుంది’ అన్నాను.అపుడు చర్చ తెగేదాకా లాగవద్దనే సలహామేరకు చర్చ ఆపుచేసాము.

కమ్యూనిస్టు పార్టీల్ని (పార్లమెంటరీ), విప్లవ పార్టీల్ని నడిపించే నాయకత్వాల్లో ఆయా పార్టీలకు అనుబంధంగా ఉన్న మేధావి వర్గం, ఈ దేశ వాస్తవ సామాజిక జీవితాన్ని సరిగ్గా అంచనా వేసి, కనీసం 1990 నుండి ‘కులాన్ని’ గుర్తించినటై్లనా- 1930 నుండి గుర్తించ గలిగినట్లయితే, దోపిడీ కులాల పునాది నుండి వచ్చిన వామపక్ష మేధావుల పట్ల దళిత మేధావుల స్పందన సానుకూలంగా ఉండేదేమో! ఇకనైనా వీరు నిర్వహించవలసిన దిక్సూచి పాత్రనుండి (వ్యాన్‌గార్డ్‌) తప్పుకొని అనుకరణ స్థాయికి దిగిన వైనాన్ని విశ్లేషించుకోవాలి. మొదట కుల సమస్య లేదన్న వాళ్ళు, తరువాత కుల సమస్య కేవలం మానసిక ప్రవృత్తి, అంటే ‘కులం ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు’ అన్నారు.

‘కులం కేవలం ఉపరితల సమస్యే, పునాది కాదు’ అన్నారు. ఆ తరువాత- ‘కులం’ అనేది పునాది, ఉపరితలం రెండూ’ అన్నారు. భారత దేశం అంటే ‘కులం’, ‘మనవాడు’, ‘మనోడేనా’ అనే స్పష్టమైన విభజన కనిపిస్తుంటే, 90 సంవత్సరాల నుండి ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడన్నట్లు’ వామపక్షాలు ప్రవర్తిస్తుంటే ఏమనుకోవాలి? 2010 అక్టోబర్‌ 25న ప్రఖ్యాత మార్క్సిస్టు చరిత్ర కారుడు విక్టర్‌ కీర్నన్‌ సంస్మరణార్థం బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన లెసన్స్‌ ఆఫ్‌ ఎంపైర్‌ (సామ్రాజ్య పాఠాలు) సదస్సులో ప్రసంగిస్తూ సి.పి.ఎం.

పార్టీ జాతీయ కార్యదర్శి ‘కులం గురించి పట్టించుకోక పోవడం కమ్యూనిస్టుల చారిత్రక తప్పిదం’ అన్నవాడు- 24 గంటలు దాటక ముందే నిన్నటి మాటను దాటవేశాడు. వీళ్ళలో మార్క్సిజం కన్నా మనువాదం పాలు ఎక్కువ ఉందనుకోవడంలో దళిత మేధావుల తప్పుందా? కులం ప్రాముఖ్యత గురించి నాకు అర్థమైనంత వరకు వామపక్ష నాయకత్వానికి, మేధావులకి అర్థం కాక కాదు. వారి కుల దోపిడీకి గురై, అడుగడుగునా అడ్డంకుల్ని దాటుకొని, విద్యావంతులమై, అతి కష్టం మీద సంపాదించుకున్న అనుభవజ్ఞానాన్ని, మాతో కలిసి పనిచేసిన, చేస్తున్న వ్యక్తుల, సంస్థల ఉద్యమాల, ప్రతికూల పరిసర ప్రభావాల ఫలితంగా, మాకొచ్చిన అంచనాల ఫలితమే, మా అభిప్రాయం.

అణచివేతకు గురైన కులాలకు, నేడు ఈ మాత్రమైనా బతుకు భరోసా ఉందంటే, మూడు సంస్థల కృషి ఫలితమని 1991 అక్టోబర్‌ 1న ఖమ్మంలో ప్రభుత్వం నిర్వహించిన ఖమ్మం జిల్లా ఆవిర్భావ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రకటించాను. అవి- క్రిస్టియానిటీ (అంటరాని వాళ్ళతో కరచాలనం, దేవుడిని చూప నిరాకరణకు గురైన వాళ్ళకి ప్రత్యామ్నయ దేవుడిని చూపించడం), బి. ఆర్‌. అంబేడ్కర్‌(జ్ఞాన సముపార్జనకు మార్గాన్ని చూపాడు), వామపక్ష విప్లవ సంస్థలు (ప్రశ్నించి, ఎదిరించి నిలబడే ధైర్యాన్నిచ్చాయి).

ఫూలే- వామపక్ష మేధావులు: బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ని బ్రిటిష్‌ ఏజెంటన్న మార్క్సిస్టు మేధావులు మహాత్మా ఫూలేని ఎందుకు విస్మరించారు? రాజారామ్‌ మోహన్‌ రాయ్‌ని, కందుకూరి వీరేశలింగం పంతుల్ని, గురజాడ అప్పారావుని, గాంధీని, నెహ్రూని చివరకు ఎమర్జెన్సీ విధించి పౌరహక్కుల్ని హరించిన ఇందిరా గాంధీని కూడ పొగిడిన వామపక్ష మేధావులు, నాయకులు ఫూలేను గురించి, కనీసం చర్చలోకి కూడ ఎందుకు తీసికొని రాలేదు? విదేశీయులైన రోజలిండ్‌ ఓ హాలన్‌, గెయిల్‌ ఓంవెత్‌ల పరిశోధనల మూలంగా, బహుజన సమాజ్‌ పార్టీ, బహుజనులు నడిపిన ‘నలుపు’ పత్రిక ద్వారానే తెలుగు నాట ఫూలే గురించి, ఆయన నడిపిన పోరాటాల గురించి, బ్రాహ్మణిజం విష సంసృ్కతి గురించి దేశానికి తెలిసింది కాని, ఏ ఒక్క మార్క్సిస్టు నాయకుడు, మేధావి ఈ పనికి పూనుకున్నాడా? ఈ వ్యతిరేకతను ఏమనాలి?

ఈ దేశంలో మార్స్కిజం మనువాదానికి, బ్రాహ్మణిజానికి దాసోహమన్నదనాలా, మార్క్సిజం ముసుగేసుకున్న మనువాదం- మార్క్సిజాన్ని మింగేసిందనాలా? భారత దేశ చరిత్ర, స్వాతంత్య్ర ఉద్యమాలు, హేతువాదం, భౌతికవాదం- ఇలా అనేక విషయాల మీద ఉపన్యాసాలిచ్చే వీరు ఫూలే గురించి మాట్లాడలేదెందుకు? వామపక్ష మేధావులు డి.డి. కోశాంబి, బిపిన్‌ చంద్ర, రాహుల్‌ సాంకృత్యాయన్‌, ఆర్‌.ఎస్‌. శర్మ- వీరెవరికి ఫూలే గురించి తెలి యదనుకోవాలా? ఆంధ్ర రాష్ర్టంలోని, చరిత్రకారులు, విప్లవ కవులు, మేధావుల దృష్టిలో ఫూలే పోరాటాలు అభివృద్ధినిరోధక పోరాటాలా? బ్రాహ్మణిజంలో నిశ్శబ్ద హత్యే ఒక ఆయుధం.ఈ సైలెంట్‌కిల్లింగ్‌లో వామపక్ష మేధావులు భాగస్వాములై నారనటానికి ఫూలేఉదంతం ఒక సాక్ష్యం. ఇందుకు కారణం ఫూలే బ్రాహ్మణిజాన్ని, వేదాల్ని, వాటి ప్రమాణాల్ని,వాటి క్రిమినల్‌ మనస్త త్వాన్ని బట్టబయలు చేశాడు. అందుకే ఈ హిందూ కమ్యూనిస్టు మేధావులకి ఫూలే అంటే అంత కక్ష.

అంబేడ్కర్‌- వామపక్ష మేధావులు: సాధారణంగా వ్యక్తులపట్ల, సంస్థలపట్ల తప్పుడు నిర్ణయాలు చేసేవాళ్ళకి ఎక్కువ కారణాలు తెలిసి ఉండాలి. కానీ అంబేడ్కర్‌ని- కుల వ్యవస్థ, దాని ఆవిర్భావం, కొనసాగింపుకు దోహదపడే అంశా ల్ని పరిశీలించటంలో వామపక్ష మేధావులకి గాని, వామపక్ష పార్టీలకిగాని సరైన అవగాహనకి రావడానికి అవసరమైన సమాచారం కోసం ప్రయత్నించినట్లు లేదు. ఒక వ్యక్తి, ‘పుట్టుక తోటే ప్రతిభావంతుడు’ అనే సిద్దాంతాన్ని మార్క్సిజం కాని న్యూరో సైన్సెస్‌ కాని ఒప్పుకోవు. అదేవిధంగా ‘వైరుధ్యాలు’ తెలిసికొని, పరిష్కరించడంలో మావో ఆలోచనను గాని, మావోయిజాన్ని గాని అవగాహన చేసికొన్నవాడైతే, ‘లెనిన్‌ ఇండియాలో పుడితే గాంథీ అయ్యేవాడని, గాంథీ రష్యాలో పుడితే లెనిన్‌ అయ్యేవాడనే నిర్ణయానికి,భగవత్‌గీతలో మార్క్సిజం ఉంది’ అనే తప్పుడు నిర్ణయాలకి కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకుడు శ్రీపాద అమృత డాంగే రాడు.

మద్రాసు రాష్ర్టంలో, దేశ వ్యాప్తంగా బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలను (ఉదా:పెరియార్‌, నారాయణ గురు, అంబేడ్కర్‌) బ్రాహ్మణ నాయకత్వానికి వ్యతిరేకంగాను, వారి ఎదుగుదలను ఓర్వలేకనే బ్రాహ్మణే తరులు నిర్వహిస్తున్న ఉద్యమాలుగా ను డాంగే చిత్రీకరించారు. ఈ దేశ మూల వాసుల తిరుగుబాట్లు, చార్వాక, బౌద్ధ తాత్త్విక విచారణలు, ఉద్యమాల గురించి గాని, తద్విరుద్ధమైన రామాయణ, భారత, భగవత్‌ గీతల్లోని శ్రామిక కులాల వ్యతిరేక తాత్త్విక ఆలోచన్లను గురించి గాని వీరు ఏనాడు శాస్త్రీయంగా విశ్లేషించి చర్చించలేదు.

సి.పి.ఎం. పార్టీ సీనియర్‌ నాయకుడు, కేరళ రాష్ర్ట వామపక్ష పార్టీ ప్రథమ ముఖ్యమంత్రి ఇ.ఎమ్‌.ఎస్‌. నంబూద్రి పాద్‌కు అంబేడ్కర్‌ పట్ల ఎంత తిర స్కార, వ్యతిరేక భావం ఉందంటే- తను రాసిన ‘భారత స్వాతంత్య్ర పోరాట చరిత్ర’ అనే పుస్తకంలోని 773 పేజీల్లో కనీసం రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో గాని, రాజ్యాం గ పరిషత్తులో గానీ అంబేడ్కర్‌ ప్రసక్తి లేకుండా, రాకుండా జాగ్రత్త పడ్డారు. వైస్రా య్‌ కౌన్సిల్‌లో, అంబేడ్కర్‌ సభ్యునిగా చేరినందుకు సామ్రాజ్యవాదుల ఏజెంట్‌ అని, విప్లవ ద్రోహి అని నిందించారు అప్పటి కమ్యూనిస్టు నాయకులు.

అంబేడ్కర్‌ ఉద్య మాన్ని వామపక్ష నాయకులు, మేధావులు, చరిత్రకారులు కూడా ‘జాతీయోద్య మాన్ని బలహీన పరిచే చీలిక ఉద్యమంగా, ప్రమాదకరమైన బ్రిటిష్‌ అనుకూల ఉద్యమం’(భారతదేశ స్వాతంత్రోద్యమం 1857-1947, బిపిన్‌ చంద్ర పాల్‌ (1989)గా చిత్రించారు. అంబేడ్కర్‌ విషయంలో ఇప్పటికీ పార్లమెంటరీ కమ్యూ నిస్టు పార్టీల నుండి విప్లవ కమ్యూనిస్టు పార్టీల వరకు వేస్తున్న అంచనాలు దోపిడీ కుల కంపు కొడుతున్నాయి.

ఆ కంపుని దాచుకొనే ప్రయత్నమే వీరు తగిలిం చుకున్న మార్స్కిజం బురఖా. వీరు వల్లించే ‘సోషలిజం’ వీరి ‘కులం పెట్టుబడికి’ ఒక రక్షణ కవచం. అంబేడ్కర్‌ సిద్ధాంతం, ఆచరణ, ఉద్యమాల గురించి హిందూ కమ్యూనిస్టుల అభిప్రాయాలు చూడండి: 1976-77 ల్లో సి. పి. ఐ. (ఎం. ఎల్‌) వినోద్‌ మిశ్రా గ్రూప్‌ ఒక డాక్యుమెంట్‌ను మూర్తి అనే ఆంధ్రా నాయకుడి ద్వారా ఉస్మానియా మెడికల్‌ కాలేజీలోని వామపక్ష విద్యార్థుల్లో అంబేడ్కర్‌ మీద చర్చకు పెట్టారు. అందులో అంబేడ్కర్‌ కులతత్వవాది అనీ, బ్రిటిష్‌ ఏజంట్‌ అనీ రాశారు.

gopinadhచండ్ర పుల్లారెడ్డి సిద్ధాంత పునాదితో సి.పి.ఐ (ఎం.యల్‌) పార్టీని నడిపిన కూర రాజన్న నాయకత్వంలోని జనశక్తి పార్టీ ‘దళిత సమస్య విప్లవ కమ్యూనిస్టు పార్టీ వైఖరి, ఒక సంక్షిప్త వివరణ’ అనే డాక్యుమెంట్‌లో అంబేడ్కర్‌ను ఉద్దేశిస్తూ: ‘1. బూర్జువా ప్రజాస్వామిక వాది. 2. దేశంలో బూర్జువా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పా లని నొక్కిచెప్పాడు. 3. సామ్రాజ్యవాదులతోటి, అర్థ వలస, అర్థ భూస్వామ్య పాలక వర్గాలతో రాజీపడ్డాడు. 4.సామ్రాజ్యవాదుల నయావలస విధానాన్ని అర్థం చేసు కోవడంలో విఫలమయ్యాడు. 5. సమానత్వం స్థానంలో భ్రమాత్మక సమానత్వాన్ని ఎంచుకున్నాడు.6. కులవ్యవస్థ పుట్టుక గురించి పరిశీలించలేదు’ అని రాశారు.

దళిత మేధావులు - వామపక్ష మేధావులు -3


‘పాలక వర్గం మేథావుల్ని ఎంత ఎక్కువగా తనలో ఇముడ్చుకుంటుందో అంత స్థిరంగా, అంత ప్రమాదకరంగా దాని పాలన తయారవుతుంది’- కార్లమార్క్స్‌, కాపిటల్‌ నుంచి
ఇక సి.పి.ఐ(యం.యల్‌) న్యూ డెమెక్రసీ గురించి. 270 గిరిజన గూడేలు మునిగి పోతాయని, లక్షలాది గిరిజనుల బతుకులు బజారున పడతాయని, పర్యావరణం దెబ్బ తింటుందని ప్రజలందరూ చాటినా, పోలవరం కట్టవలసిందే అని వ్యాసాలు రాసి, ప్రస్తుతం కొన ఊపిరితో ఉన్న తమ పార్టీని రక్షించుకోడానికి ప్రత్యేక తెలం గాణ నినాద ఆర్తనాదాన్ని వినిపిస్తున్న వీరి సిద్ధాంత కర్త వేములపల్లి వెంకట్రా మయ్య ‘భారతదేశంలో కుల వ్యవస్థ, భిన్న దృక్పధాలు అన్న తన పుస్తకంలో అంబేడ్కర్‌ గురించి తనకుల దురహంకార జ్ఞానాన్ని ఈ క్రింది విధంగా బయట పెట్టుకున్నాడు.1. శ్రమ విభజన వల్ల కులాలు ఏర్పడ్డాయి. 2. కుల వ్యవస్థకు ఫ్యూడల్‌ వ్యవస్థ పునాదిగా కొనసాగుతున్నది.

‘కులాల ఆవిర్భావం కొనసా గింపునకు శ్రమ విభజన కారణం’అని వీరు నమ్మి, నమ్మించిన సిద్ధాంతం ఒక మచ్చుతునక. ప్రపంచ ప్రజల చరిత్ర, భారత దేశ ప్రజల చరిత్ర, వారి వారి జీవన విధానాలు తెలియని ఇలాంటి వాళ్ళు విప్లవాలు తీసికొస్తారట! ఈ దేశంలోని కుల వ్యవస్థ లాభ, నష్టాలను, అంటే ఏ కులాలు లాభ పడతాయి, ఏ ఏ కులాలు నష్టపోతాయి అన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసికొన్న వాళ్ళు ముగ్గురు. వారు: జోతి రావ్‌ ఫూలే, అంబేద్కర్‌, గాంధీ. కుల వ్యవస్థ వల్ల భారత దేశం అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందని జోతిరావ్‌ ఫూలే, అంబేడ్కర్‌లు వివరిస్తే, కుల వ్యవస్థే హిందూ మతానికి ప్రాణం అని గాంధీ వాదించారు.

వేముల పల్లి ప్రకారం కుల వ్యవస్థకి ఫ్యూడల్‌ వ్యవస్థ పునాదట! కుల సంసృ్కతి ఫ్యూడల్‌ సంసృ్కతిలో భాగమట! కానీ కుల వ్యవస్థ ఏర్పాడటానికి ప్రధాన కారణం బలప్రయోగం, అంటే యుద్ధం. కిరాతక పరాయి ఆర్య తెగలకు ఈ దేశ మూలవాసులకు ఆహార సేకరణ దశ అంతరించి ఆహార ఉత్పత్తి దశ ప్రారంభకాలంలో జరిగిన గణ యుద్ధాలు. ఆ యుద్ధాల్లో పోరాడిన నాటి దస్యులే నేటి అంటరాని కులాలు. ఆ గణ యుద్ధాల్లో చనిపోయిన మూలవాసుల యుద్ధ వీరులే నరకుడు, జరాసంధుడు, మహీషుడు, వాలి, రావణ, బలి చక్రవర్తులు. యుద్ధ పిపాసులైన దోపిడీ దొంగలే ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణు, రాముడు, కృష్ణుడు. మాతృ భూమికై పోరాడిన వాళ్ళను రాక్షసులని, మహర్‌లని (మహా= భయంకరమైన, హరి= శతృవు), అంటరాని వాళ్ళని ముద్ర వేశారు.

యుద్ధంలో ఓడిపోయిన యుద్ధ ఖైదీల సంతతికి నీచమైన వృత్తుల్ని అంట గట్టి వెలివేసారు. యుద్ధంలో గెలిచిన ఆర్యుల వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేయడా నికి యుద్ధ ఖైదీల సంతతిని, బానిసలుగా, ఏ హక్కులు లేకుండా చేశారు. రాబోయే తరాలు చరిత్ర తెలిసికొని తిరగబడకుండా దేవతలు, రాక్షసులని, కులాల్ని దేవుడు సృష్టించాడనే కట్టు కథలల్లారని, వీళ్ళ కట్టుకథల్ని చదవితే వాస్తవాలు బయటపడ్తాయనే భయంతో వీళ్ళు చదవకూడదనే ఆంక్ష విధించారనేది వాస్తవం. అందుకే, కులాల ఏర్పాడడానికి కారణం శ్రమ విభజన కాదు. కామ్రేడ్స్‌ అవగాహన తప్పు. వారు ఇప్పటి వరకు తెలిసి నమ్మినా, తెలియక నమ్మినా అది నేరపూరిత సిద్ధాంతం.

వేములపల్లి వెంకట్రామయ్య రాసిన ‘భారత దేశంలో కులవ్యవస్థ భిన్న దృక్పథాలు’ అన్న తన పుస్తకంలో అంబేడ్కర్‌ను కోట్‌ చేసూ తేల్చిన అబద్ధాల చిట్టా ఎలా ఉందంటే, ‘అవకాశవాద జారుడు బండ మీద అడ్డంగా నిలబ్టెబడ్డ చెంబు’లా ఉంది. అయితే రంగనాయకమ్మ, వేములపల్లి వెంకట్రామయ్య అంబేడ్కర్‌ మీద రాసిన పుస్తకాలు, వాటిలో వారి కుల దురహంకారం ఒకే విధంగా ఉంది. రంగనాయకమ్మ రాసిన ‘బుద్ధుడు చాలడు, అంబేడ్కర్‌ చాలడు’ అనే పుస్తకానికి జవాబులు ఇప్పటికే వచ్చేశాయి. వేములపల్లి వెంకట్రామయ్యకు ఒక ప్రశ్న!

‘భారత దేశంలో ఫ్యూడల్‌ వ్యవస్థతోనే కులాలు ప్రారంభమయ్యాయా? లేక ఫ్యూడలిజం ఒక వ్యవస్థగా రూపుదిద్దుకోకముందే భారత దేశంలో కులాలు ఏర్పడ్డాయా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. పై విషయాలు పరిశీలించినట్లయితే, ‘‘అంబేడ్కర్‌- ఆరుగురు గుడ్డి వాళ్ళు’ సామెత చెప్పుకోవచ్చు. తమ ప్రాణాలను తృణప్రాయంగా ప్రజల కొరకు అర్పిస్తున్న అప్పటి పీపుల్స్‌ వార్‌ పార్టీ కూడా అంబేడ్కర్‌ని ‘లిబరల్‌ బూర్జువా’ గా ముద్రవేయడం!

ఉదాహరణకు చేతబడి, బాణామతి విషయాన్నే తీసుకుందాం. చేతబడి చేసేది ఏ కులాలవారు, చేతబడి వలన చనిపోయేది ఏ కులాలవారు? చేతబడి చేశారని పండ్లు ఊడకొట్టించుకున్నది, సజీవ దహనానికి గురి అయినది ఏ కులాలవారు? ఈ విషయం మీదనే 2006 ఫిబ్రవరి 11 న మంగళగిరి చార్వాక ఆశ్రమంలో అక్కడ చేరిన మేధావులను ‘క్షుద్ర విద్యలకి మూల గ్రంథం అధర్వణ వేదం కదా! (అధర్వణ=చేతబడి=బ్లాక్‌ మ్యాజిక్‌). రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలన్ని చదివేది బ్రాహ్మణ వర్గం కదా! మరి చరిత్రలో ఏనాడైనా ఒక్క బ్రాహ్మణుణ- చేతబడి చేశాడని పండ్లూడగొట్టిన సందర్భంగాని, సజీవ దహనం చేసిన సందర్భం కానీ చూపించగలరా? చదువురాని శ్రామిక కులాల వాళ్ళు మంత్రాలెట్లా పెడతారు?’ అని అడిగాను. సమాధానం రాలేదు.

మొన్ననే నల్లగొండ జిల్లా, చౌటుప్పల్‌ మండలంలోని కైతాపూర్‌ గ్రామంలో, దోపిడీ కులాల పెత్తందార్లకు ఎదురు తిరిగినందుకు గుద్గేటి యల్లయ్య అనే దళిత నాయకుణ్ణి, అతనితో పాటు మరో కుమ్మరి కులస్థుణ్ణి చేతబడి పేరుతో సజీవ దహనం చేసిన సంఘటన కళ్ళముందే మెదులుతున్నది. అంటే శ్రామిక కులాల అణచివేతలో భాగంగానే బాణామతి, చాతబడి వంటి ఆయుధాల్ని ఉపయోగిస్తున్నారన్న విషయం కూడా ఈ మేధావులు బయట పెట్టలేదంటే వీరి సాంసృ్కతిక విప్లవ సైనికులు ఏం చేస్తున్నట్లు? ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా తప్పించుకొనే కాలం అంతరించి పోయింది.

భారతదేశ చరిత్రలో విలన్లుగా, రాక్షసులుగా ముద్ర పడ్డ నరక మహారాజు, మహీష చక్రవర్తి, బక మహారాజు, రాజా జరాసంధ, రావణ, బలి చక్రవర్తుల జయంతులు, వర్థంతులు జరపడానికి మా సాంసృ్కతిక సైనికదళాలు సిద్ధమవుతున్నాయి. ఫాసిస్ట్‌ బ్రాహ్మణీయ హిందూ సంసృ్కతికి వ్యతిరేకమైన ఈ దేశ అసలైన ప్రజా సంసృ్కతిని ప్రతిష్ఠిస్తాం.బి.ఆర్‌.అంబేడ్కర్‌ పట్ల వామపక్ష మేధావుల, ఉద్యమకారుల అభిప్రాయాలను, వారి రాతలను చదివిన తరువాత దళిత మేధావులు ఏ విధంగా స్పందించాలని కోరుకుంటారు? గాంధీని పొగిడిన కమ్యూనిస్టులు, నెహ్రూలో, ఇందిరా గాంథీలో సోషలిజాన్ని చూచిన కమ్యూనిస్టులు కందుకూరిని రాజా రామ్‌ మోహన్‌ రాయ్‌ని (బ్రాహ్మణ వితంతు వివాహాల సంస్కరణ ఉద్యమకారులు).

శ్రీశ్రీ (మార్క్సిజానికే వ్యతిరేకి అయిన ఓ మేధావి)ని భుజాన వేసుకొని ఊరేగుతున్న వామపక్ష మేధావుల గురించి దళితులు ఏ అవగాహనకు రావాలనుకుంటున్నారు? తమ కులంలోని కుళ్ళునే కొంత మేరకు కడుక్కోవాలని ప్రయత్నించినవారి పట్ల, అభివృద్ధి నిరోధకుడైన గాంథీ పట్ల, గోడమీద పిల్లి సోషలిసు,్ట తెలంగాణ సాయుధ పోరాటాన్ని రక్తపుటేరుల్లో ముంచిన నెహ్రూ పట్ల, హిట్లర్‌ వారసురాలు ఇందిరా గాంథీని పొగిడిన ఎస్‌.ఎ. డాంగే పట్ల, ఉదారంగా వ్యవహరించిన వామపక్ష మేధావులు అంబేడ్కర్‌ని ఎందుకు రకరకాల ముద్రలు వేస్తున్నారనే సందేహం రావటం సహజం! కారంచేడు, చుండూరు సంఘటనలు జరిగినపుడు స్పందించని విప్లవ ‘కుల’ కలాలు రాసే చెత్తను, నెత్తికెత్తుకోవాలా?

విప్లవం, విముక్తి కొందరికి ఆదర్శమయితే ‘మాకు అది అవసరం’. బహుళజాతి సంస్థల విషపుత్రికలైన ఎన్జీఓలను, అమెరికా సామ్రాజ్యవాదాన్ని నెత్తికెత్తుకుని ఊరేగే దళిత మేధావులున్నట్లే, పాలక కులాల అధికారుల అభయ హస్తం అందుకుంటూ, విప్లవకారుల ‘మరణవార్త’ని లోకానికి తెలియజేయటమే విప్లవ కార్యక్రమమని భ్రమింపజేసే మాయా మేధావులపట్ల అప్రమత్తంగా ఉండాలి.నిజాయితీ, నియమాలకు కట్టుబడే దళిత మేధావులు, ఈ దుష్ట సమాజాన్ని సమూలంగా మార్చాలని అనుకునే వామపక్ష మేధావులు- అంటే ఇరుపక్షాలు సంక్లిష్టమైన భారతీయ సమాజాన్ని వాస్తవ దృష్టితో అవగాహన చేసికోటానికి ప్రయత్నించాలి.

gopinadhదళిత మేధావులు కూడా ఎవరో చేయలేదని నెపాన్ని నెట్టివేసే అలవాటును మానుకొని భారతీయ తాత్త్విక చింతనలోని అభివృద్ధికర హేతువాద ధృక్ఫథాలను, మార్క్సిజం రిలవెన్స్‌ను, ఫూలే, అంబేడ్కర్‌ సిద్ధాంతాల్ని ఆచరణ ద్వారా బేరీజు వేసుకుని, నిజమైన మిత్రులను దూరం చేసుకోకుండా జాగ్రత్త పడాలి.‘సమాజ మార్పు’ అవసరంగా, ‘మార్చటం’ తమ బాధ్యతగా గుర్తించాలి. వామపక్ష శిబిరంలోని మేధావులు 90 సంవత్సరాల వైఫల్యాలు, అందుకు కారణాలు, విశ్లేషించుకుని దళిత మేధావుల అవేదనలను, ప్రతిస్పందనలను శాస్త్రీయంగా పరిశీలించి తమకు తమ కులాల ద్వారా వచ్చిన ఆధిక్యతా భావనను వదులుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే దళిత- వామపక్ష ఉద్యమాల మధ్య సమన్వయం ఏర్పడి అసలైన శత్రు శిబిరాల్ని ధ్వంసం చేయవచ్చు.(అయిపోయింది)