Total Pageviews

Monday, November 8, 2010

దళిత మేధావులు - వామపక్ష మేధావులు -3


‘పాలక వర్గం మేథావుల్ని ఎంత ఎక్కువగా తనలో ఇముడ్చుకుంటుందో అంత స్థిరంగా, అంత ప్రమాదకరంగా దాని పాలన తయారవుతుంది’- కార్లమార్క్స్‌, కాపిటల్‌ నుంచి
ఇక సి.పి.ఐ(యం.యల్‌) న్యూ డెమెక్రసీ గురించి. 270 గిరిజన గూడేలు మునిగి పోతాయని, లక్షలాది గిరిజనుల బతుకులు బజారున పడతాయని, పర్యావరణం దెబ్బ తింటుందని ప్రజలందరూ చాటినా, పోలవరం కట్టవలసిందే అని వ్యాసాలు రాసి, ప్రస్తుతం కొన ఊపిరితో ఉన్న తమ పార్టీని రక్షించుకోడానికి ప్రత్యేక తెలం గాణ నినాద ఆర్తనాదాన్ని వినిపిస్తున్న వీరి సిద్ధాంత కర్త వేములపల్లి వెంకట్రా మయ్య ‘భారతదేశంలో కుల వ్యవస్థ, భిన్న దృక్పధాలు అన్న తన పుస్తకంలో అంబేడ్కర్‌ గురించి తనకుల దురహంకార జ్ఞానాన్ని ఈ క్రింది విధంగా బయట పెట్టుకున్నాడు.1. శ్రమ విభజన వల్ల కులాలు ఏర్పడ్డాయి. 2. కుల వ్యవస్థకు ఫ్యూడల్‌ వ్యవస్థ పునాదిగా కొనసాగుతున్నది.

‘కులాల ఆవిర్భావం కొనసా గింపునకు శ్రమ విభజన కారణం’అని వీరు నమ్మి, నమ్మించిన సిద్ధాంతం ఒక మచ్చుతునక. ప్రపంచ ప్రజల చరిత్ర, భారత దేశ ప్రజల చరిత్ర, వారి వారి జీవన విధానాలు తెలియని ఇలాంటి వాళ్ళు విప్లవాలు తీసికొస్తారట! ఈ దేశంలోని కుల వ్యవస్థ లాభ, నష్టాలను, అంటే ఏ కులాలు లాభ పడతాయి, ఏ ఏ కులాలు నష్టపోతాయి అన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసికొన్న వాళ్ళు ముగ్గురు. వారు: జోతి రావ్‌ ఫూలే, అంబేద్కర్‌, గాంధీ. కుల వ్యవస్థ వల్ల భారత దేశం అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందని జోతిరావ్‌ ఫూలే, అంబేడ్కర్‌లు వివరిస్తే, కుల వ్యవస్థే హిందూ మతానికి ప్రాణం అని గాంధీ వాదించారు.

వేముల పల్లి ప్రకారం కుల వ్యవస్థకి ఫ్యూడల్‌ వ్యవస్థ పునాదట! కుల సంసృ్కతి ఫ్యూడల్‌ సంసృ్కతిలో భాగమట! కానీ కుల వ్యవస్థ ఏర్పాడటానికి ప్రధాన కారణం బలప్రయోగం, అంటే యుద్ధం. కిరాతక పరాయి ఆర్య తెగలకు ఈ దేశ మూలవాసులకు ఆహార సేకరణ దశ అంతరించి ఆహార ఉత్పత్తి దశ ప్రారంభకాలంలో జరిగిన గణ యుద్ధాలు. ఆ యుద్ధాల్లో పోరాడిన నాటి దస్యులే నేటి అంటరాని కులాలు. ఆ గణ యుద్ధాల్లో చనిపోయిన మూలవాసుల యుద్ధ వీరులే నరకుడు, జరాసంధుడు, మహీషుడు, వాలి, రావణ, బలి చక్రవర్తులు. యుద్ధ పిపాసులైన దోపిడీ దొంగలే ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణు, రాముడు, కృష్ణుడు. మాతృ భూమికై పోరాడిన వాళ్ళను రాక్షసులని, మహర్‌లని (మహా= భయంకరమైన, హరి= శతృవు), అంటరాని వాళ్ళని ముద్ర వేశారు.

యుద్ధంలో ఓడిపోయిన యుద్ధ ఖైదీల సంతతికి నీచమైన వృత్తుల్ని అంట గట్టి వెలివేసారు. యుద్ధంలో గెలిచిన ఆర్యుల వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేయడా నికి యుద్ధ ఖైదీల సంతతిని, బానిసలుగా, ఏ హక్కులు లేకుండా చేశారు. రాబోయే తరాలు చరిత్ర తెలిసికొని తిరగబడకుండా దేవతలు, రాక్షసులని, కులాల్ని దేవుడు సృష్టించాడనే కట్టు కథలల్లారని, వీళ్ళ కట్టుకథల్ని చదవితే వాస్తవాలు బయటపడ్తాయనే భయంతో వీళ్ళు చదవకూడదనే ఆంక్ష విధించారనేది వాస్తవం. అందుకే, కులాల ఏర్పాడడానికి కారణం శ్రమ విభజన కాదు. కామ్రేడ్స్‌ అవగాహన తప్పు. వారు ఇప్పటి వరకు తెలిసి నమ్మినా, తెలియక నమ్మినా అది నేరపూరిత సిద్ధాంతం.

వేములపల్లి వెంకట్రామయ్య రాసిన ‘భారత దేశంలో కులవ్యవస్థ భిన్న దృక్పథాలు’ అన్న తన పుస్తకంలో అంబేడ్కర్‌ను కోట్‌ చేసూ తేల్చిన అబద్ధాల చిట్టా ఎలా ఉందంటే, ‘అవకాశవాద జారుడు బండ మీద అడ్డంగా నిలబ్టెబడ్డ చెంబు’లా ఉంది. అయితే రంగనాయకమ్మ, వేములపల్లి వెంకట్రామయ్య అంబేడ్కర్‌ మీద రాసిన పుస్తకాలు, వాటిలో వారి కుల దురహంకారం ఒకే విధంగా ఉంది. రంగనాయకమ్మ రాసిన ‘బుద్ధుడు చాలడు, అంబేడ్కర్‌ చాలడు’ అనే పుస్తకానికి జవాబులు ఇప్పటికే వచ్చేశాయి. వేములపల్లి వెంకట్రామయ్యకు ఒక ప్రశ్న!

‘భారత దేశంలో ఫ్యూడల్‌ వ్యవస్థతోనే కులాలు ప్రారంభమయ్యాయా? లేక ఫ్యూడలిజం ఒక వ్యవస్థగా రూపుదిద్దుకోకముందే భారత దేశంలో కులాలు ఏర్పడ్డాయా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. పై విషయాలు పరిశీలించినట్లయితే, ‘‘అంబేడ్కర్‌- ఆరుగురు గుడ్డి వాళ్ళు’ సామెత చెప్పుకోవచ్చు. తమ ప్రాణాలను తృణప్రాయంగా ప్రజల కొరకు అర్పిస్తున్న అప్పటి పీపుల్స్‌ వార్‌ పార్టీ కూడా అంబేడ్కర్‌ని ‘లిబరల్‌ బూర్జువా’ గా ముద్రవేయడం!

ఉదాహరణకు చేతబడి, బాణామతి విషయాన్నే తీసుకుందాం. చేతబడి చేసేది ఏ కులాలవారు, చేతబడి వలన చనిపోయేది ఏ కులాలవారు? చేతబడి చేశారని పండ్లు ఊడకొట్టించుకున్నది, సజీవ దహనానికి గురి అయినది ఏ కులాలవారు? ఈ విషయం మీదనే 2006 ఫిబ్రవరి 11 న మంగళగిరి చార్వాక ఆశ్రమంలో అక్కడ చేరిన మేధావులను ‘క్షుద్ర విద్యలకి మూల గ్రంథం అధర్వణ వేదం కదా! (అధర్వణ=చేతబడి=బ్లాక్‌ మ్యాజిక్‌). రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలన్ని చదివేది బ్రాహ్మణ వర్గం కదా! మరి చరిత్రలో ఏనాడైనా ఒక్క బ్రాహ్మణుణ- చేతబడి చేశాడని పండ్లూడగొట్టిన సందర్భంగాని, సజీవ దహనం చేసిన సందర్భం కానీ చూపించగలరా? చదువురాని శ్రామిక కులాల వాళ్ళు మంత్రాలెట్లా పెడతారు?’ అని అడిగాను. సమాధానం రాలేదు.

మొన్ననే నల్లగొండ జిల్లా, చౌటుప్పల్‌ మండలంలోని కైతాపూర్‌ గ్రామంలో, దోపిడీ కులాల పెత్తందార్లకు ఎదురు తిరిగినందుకు గుద్గేటి యల్లయ్య అనే దళిత నాయకుణ్ణి, అతనితో పాటు మరో కుమ్మరి కులస్థుణ్ణి చేతబడి పేరుతో సజీవ దహనం చేసిన సంఘటన కళ్ళముందే మెదులుతున్నది. అంటే శ్రామిక కులాల అణచివేతలో భాగంగానే బాణామతి, చాతబడి వంటి ఆయుధాల్ని ఉపయోగిస్తున్నారన్న విషయం కూడా ఈ మేధావులు బయట పెట్టలేదంటే వీరి సాంసృ్కతిక విప్లవ సైనికులు ఏం చేస్తున్నట్లు? ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా తప్పించుకొనే కాలం అంతరించి పోయింది.

భారతదేశ చరిత్రలో విలన్లుగా, రాక్షసులుగా ముద్ర పడ్డ నరక మహారాజు, మహీష చక్రవర్తి, బక మహారాజు, రాజా జరాసంధ, రావణ, బలి చక్రవర్తుల జయంతులు, వర్థంతులు జరపడానికి మా సాంసృ్కతిక సైనికదళాలు సిద్ధమవుతున్నాయి. ఫాసిస్ట్‌ బ్రాహ్మణీయ హిందూ సంసృ్కతికి వ్యతిరేకమైన ఈ దేశ అసలైన ప్రజా సంసృ్కతిని ప్రతిష్ఠిస్తాం.బి.ఆర్‌.అంబేడ్కర్‌ పట్ల వామపక్ష మేధావుల, ఉద్యమకారుల అభిప్రాయాలను, వారి రాతలను చదివిన తరువాత దళిత మేధావులు ఏ విధంగా స్పందించాలని కోరుకుంటారు? గాంధీని పొగిడిన కమ్యూనిస్టులు, నెహ్రూలో, ఇందిరా గాంథీలో సోషలిజాన్ని చూచిన కమ్యూనిస్టులు కందుకూరిని రాజా రామ్‌ మోహన్‌ రాయ్‌ని (బ్రాహ్మణ వితంతు వివాహాల సంస్కరణ ఉద్యమకారులు).

శ్రీశ్రీ (మార్క్సిజానికే వ్యతిరేకి అయిన ఓ మేధావి)ని భుజాన వేసుకొని ఊరేగుతున్న వామపక్ష మేధావుల గురించి దళితులు ఏ అవగాహనకు రావాలనుకుంటున్నారు? తమ కులంలోని కుళ్ళునే కొంత మేరకు కడుక్కోవాలని ప్రయత్నించినవారి పట్ల, అభివృద్ధి నిరోధకుడైన గాంథీ పట్ల, గోడమీద పిల్లి సోషలిసు,్ట తెలంగాణ సాయుధ పోరాటాన్ని రక్తపుటేరుల్లో ముంచిన నెహ్రూ పట్ల, హిట్లర్‌ వారసురాలు ఇందిరా గాంథీని పొగిడిన ఎస్‌.ఎ. డాంగే పట్ల, ఉదారంగా వ్యవహరించిన వామపక్ష మేధావులు అంబేడ్కర్‌ని ఎందుకు రకరకాల ముద్రలు వేస్తున్నారనే సందేహం రావటం సహజం! కారంచేడు, చుండూరు సంఘటనలు జరిగినపుడు స్పందించని విప్లవ ‘కుల’ కలాలు రాసే చెత్తను, నెత్తికెత్తుకోవాలా?

విప్లవం, విముక్తి కొందరికి ఆదర్శమయితే ‘మాకు అది అవసరం’. బహుళజాతి సంస్థల విషపుత్రికలైన ఎన్జీఓలను, అమెరికా సామ్రాజ్యవాదాన్ని నెత్తికెత్తుకుని ఊరేగే దళిత మేధావులున్నట్లే, పాలక కులాల అధికారుల అభయ హస్తం అందుకుంటూ, విప్లవకారుల ‘మరణవార్త’ని లోకానికి తెలియజేయటమే విప్లవ కార్యక్రమమని భ్రమింపజేసే మాయా మేధావులపట్ల అప్రమత్తంగా ఉండాలి.నిజాయితీ, నియమాలకు కట్టుబడే దళిత మేధావులు, ఈ దుష్ట సమాజాన్ని సమూలంగా మార్చాలని అనుకునే వామపక్ష మేధావులు- అంటే ఇరుపక్షాలు సంక్లిష్టమైన భారతీయ సమాజాన్ని వాస్తవ దృష్టితో అవగాహన చేసికోటానికి ప్రయత్నించాలి.

gopinadhదళిత మేధావులు కూడా ఎవరో చేయలేదని నెపాన్ని నెట్టివేసే అలవాటును మానుకొని భారతీయ తాత్త్విక చింతనలోని అభివృద్ధికర హేతువాద ధృక్ఫథాలను, మార్క్సిజం రిలవెన్స్‌ను, ఫూలే, అంబేడ్కర్‌ సిద్ధాంతాల్ని ఆచరణ ద్వారా బేరీజు వేసుకుని, నిజమైన మిత్రులను దూరం చేసుకోకుండా జాగ్రత్త పడాలి.‘సమాజ మార్పు’ అవసరంగా, ‘మార్చటం’ తమ బాధ్యతగా గుర్తించాలి. వామపక్ష శిబిరంలోని మేధావులు 90 సంవత్సరాల వైఫల్యాలు, అందుకు కారణాలు, విశ్లేషించుకుని దళిత మేధావుల అవేదనలను, ప్రతిస్పందనలను శాస్త్రీయంగా పరిశీలించి తమకు తమ కులాల ద్వారా వచ్చిన ఆధిక్యతా భావనను వదులుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే దళిత- వామపక్ష ఉద్యమాల మధ్య సమన్వయం ఏర్పడి అసలైన శత్రు శిబిరాల్ని ధ్వంసం చేయవచ్చు.(అయిపోయింది)

No comments:

Post a Comment