Total Pageviews

Saturday, September 3, 2011

అసమ్మతి తయారీ కార్ఖానా


80 కోట్ల జనాభా సమస్య ఆహార భద్రత విషయంలోను, ఆదివాసీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ఆపరేషన్ గ్రీన్‌హంట్ విషయాన్ని పట్టించుకోని అన్నాజీ, భారత ప్రజల మెస్సయ్య ఎలా అవుతాడు? తెలంగాణ యువకుల ప్రాణత్యాగాల్ని పట్టించుకోని ఈ దేశ మీడియా, ప్రజల్ని మాస్ హిస్టీరియోకెందుకు ఉసిగొల్పుతోంది? అణచివేయబడుతున్న కులాలు, విద్యార్ధులు, మేధావులు ఆలోచించాలి!

అవినీతికి పాల్పడేవారికే, నీతి గురించి మాట్లాడే అవసరం ఎక్కువగా వుంటుంది. వీళ్ళే 'నీతిని' ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకంటే 'నీతి' వీళ్ళకి అందని ద్రాక్ష. నిత్యజీవితంలో నీతికి కట్టుబడి ఉండటం వీళ్ళ వృత్తికి, ప్రవృత్తికి వ్యతిరేకం. కనుక సాఫ్ట్ స్కిల్స్, అపర గాంధీగారి ఆచ్ఛాదన ఉన్న హజారేగారిని వెదికి, వేదిక నెక్కించి జాతర జరిపిస్తే జనంలో కలిసిపోవచ్చు అనే ఉపాయానికి అనుగుణంగా, హైటెక్ హంగులతో రామ్‌లీలా మైదానంలో "ది గ్రేట్ ఇండియన్ సర్కస్''ని ప్రారంభించింది.

ఈ సర్కస్‌లో సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? దళిత, ఆదివాసీ, ముస్లిమ్, ఒబిసి వ్యతిరేకులు. బాబ్రీ మసీదు కూల్చివేతను, గ్రాహం స్టెయిన్స్ సజీవదహనాన్ని, గుజరాత్ గాయాల్ని, ఖైర్లాంజీ కిరాతకాన్ని, బెల్చి సజీవదహనాల్ని దైవ సమ్మత కార్యాలుగా నిర్వహించిన పవిత్ర సనాతన ధర్మరక్షకులేనన్నది తిరుగులేని వాస్తవం. అయితే అన్నా టీం ప్రశాంత్‌భూషణ్, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కిరణ్‌బేడీ, స్వామి అగ్నివేష్, బాబా రామ్‌దేవ్, మేధాపాట్కర్‌లు సనాతన ధర్మరక్షకులు అంటే ఈ లోకం నమ్మదు.. ఎందుకంటే వాళ్ళకున్న బహిర్గత ప్రజామోదం, నాగరికత, పాజిటివ్ థింకింగ్ లాంటి గుణగణాలన్నీ ఇండియన్ మేధావి వర్గాన్నే అబ్బురపరుస్తాయి.

మండల్ కమిషన్‌ను వ్యతిరేకించిన ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య విద్యార్థులకు ఈ సనాతన ధర్మరక్షకులే ఇన్స్పిరేషన్. అన్నా దీక్షా శిబిరంలో ఆగస్టు 23న జరిగిన రెండు సంఘటనలు ఇందుకు సందర్భ సాక్ష్యంగా నిలుస్తాయి.
అవి (1) అన్నా హజారే దీక్షకు మద్దతు పలుకుతూ, కల్చరల్ ప్రోగ్రాం యివ్వటానికి అక్కడికి చేరిన లిబరేషన్ గ్రూప్‌ని (యం.యల్.పార్టీ) రామ్‌లీలా మైదానం నుండి తరిమేసారు.

(2) అదే దీక్షా శిబిరం నుండి అన్నా మద్దతుదార్లు 'ఆరక్షణ్' సినిమాకి మద్దతుగా, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ఇంతకన్నా యింకేమి సాక్ష్యం కావాలి, అన్నా టీం అసలు ఉద్దేశాలు, ప్రణాళికలు అర్థం చేసుకోటానికి? అసలు 'అవినీతి' అంటే ఏమిటి? లంచగొండితనమే అవినీతా? రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకి లాభదాయకమైన ధర నిర్ణయించకుండా, గిట్టుబాటు ధర నిర్ణయించటం, పారిశ్రామిక వేత్తకి తన సరకు ధర తాను నిర్ణయించుకునే హక్కునివ్వటం, ప్రభుత్వాల చట్టబద్ధ అవినీతి కాదా? గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడే మన అపర గాంధీగారు తన ప్రాంతంలోని రైతుల ఆత్మహత్యల గురించి ఏనాడైనా రిలే నిరాహార దీక్ష అయినా చేసాడా? అవినీతి పెరిగిపోతున్నమాట వాస్తవం.

దానికి కారణమైన దోపిడీని, ఒక కల్చర్‌గా, కళగా అభివృద్ధి చేసిందెవరు? చాతుర్వర్ణ వ్యవస్థలో అగ్రభాగాన ఉన్న ప్రాబల్య కులాలు కాదా? వేల, లక్షల కోట్ల అవినీతికి పాల్పడే మైనింగ్ మాఫియాని, రాజకీయ కుబేరుల్ని, 10 రూపాయలు లంచం తీసుకొనే ట్రాఫిక్ కానిస్టేబుల్‌ని అవినీతిలో ఒకేగాటన కట్టటంలో ఉన్న నీతి ఎంత? అన్నా హజారే బృందానికి, సంఘ్ పరివార్ గ్రీన్ రూమ్ ఆపరేటర్స్‌కి 'అవినీతి' అనే తేలికపాటి ఆయుధం ఎందుకు అవసరమొచ్చింది? మల్టీనేషన్ కంపెనీలకు ఈ శతాబ్ధారంభంలో వరల్డ్ సోషల్ ఫోరమ్‌ని ఆరంభించవలసిన ఆగత్యమెందుకొచ్చిందో, ఈ దేశంలోని దోపిడి పాలక కులాలకు "అవినీతి వ్యతిరేక పోరాటమనే'' ఆయుధం అందుకే అవసరమొచ్చింది.

ప్రపంచీకరణకు ప్రత్యామ్నాయం లేదన్న మార్కెట్ వేదాన్ని, నినాదంగా మార్చినవాళ్ళే మార్కెట్ శక్తుల్ని ఎదుర్కొంటామని నమ్మబలికి ప్రపంచ సామాజిక వేదిక (వరల్డ్ సోషల్ ఫోరమ్) 21వ శతాబ్దారంభంలో ఏర్పాటు చేశారు. అది సగటు ఆశావాదికి సగటు ఆనందాన్ని కలిగించింది. 2004లో హైద్రాబాద్ (ఇండియా) ప్రపంచ సామాజిక వేదిక జరిపిన రెండు రోజుల సదస్సులో ఏఏ శక్తుల్ని ముందుంచి, ఏఏ శక్తులు వెనకుండి నడిపాయో, అర్ధమయ్యే నాటికి అవాక్కయ్యింది బాధ్యతాయుత పౌరసమాజం.

ప్రపంచీకరణ, సరళీకరణ మూడవదశలో చేరేందుకు సన్నద్ధమౌతున్న ప్రస్తుత తరుణంలో వరల్డ్‌బ్యాంక్, ఐ.యం.యఫ్ లాంటి పెట్టుబడిదారీ సంస్థలకు ఎన్జీవోల వంటి 'సమ్మతి తయారీ ఫ్యాక్టరీలు' అణగారిన జనాన్ని ఆశించినంతగా ప్రభావితం చేయలేకపోతున్నాయని గుర్తించారు. కొత్త ఫార్ములా వెదికారు. ఆ ఫార్ములానే మైఖేల్ చోసుదొ వస్కీ నిర్వచించిన మ్యానుఫాక్చరింగ్ డిసెంట్ (అసమ్మతి తయారీ) సిద్ధాంతం.

అంటే విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్ల కొరకు శాంతియుత ఊరేగింపులు తీస్తుంటే ప్రభుత్వ పెద్దలే అందులో చేరి వారికి నాయకత్వం వహిస్తున్నట్లు నటించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిస్తూ చివరకు ఆ ఉద్యమాన్ని నీరుగార్చటం; 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని మర్రి చెన్నారెడ్డి వంటి వారు, హైజాక్ చేసి చివరకు పదవులు తీసుకొని ఉద్యమాన్ని చల్లార్చటం; రాజకీయ పార్టీలు, ఎస్.సి.సెల్, బి.సి. సెల్, ఎస్.టి. సెల్, మైనారిటీ సెల్ పెట్టి ఆయావర్గాల్లో వస్తున్న చైతన్యానికి అడ్డుకట్ట వేయించే కుతంత్రాలకి పాల్పడటం; దోపిడికి గురయ్యే వర్గాల తరపున దోపిడికి పాల్పడే వర్గాలు ముందుగానే దోపిడీకి వ్యతిరేకంగా ఊరేగింపులు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేయటం ప్రారంభించి కంటితుడుపు చట్టాల్ని, అగ్రిమెంట్లని చేసి అసలు సమస్యను పక్కదోవ పట్టిస్తారు.

ఈ రోజు 'అవినీతి' అనే అంశాన్ని అందరూ అసహ్యించుకొనే స్థాయికి పెంచింది వీళ్ళే. దాన్నే ఆయుధంగా మార్చుకొని, అన్నా హజారే లాంటి గాంధేయ వాదిని రాలేగాంసిద్ధి గ్రామ జమ్మిచెట్టు నుండి దించి రాంలీలా మైదానంలో ప్రదర్శనకి పెట్టారు. 600 మందికి పైగా తెలంగాణ విద్యార్ధి యువకులు చనిపోతున్నా నోరెత్తని అన్నాజీ, ఖైర్లాంజీ కిరాతకాన్ని పట్టించుకోని గాంధేయుడు, అరుంధతీరాయ్ అన్నట్లు, మైనింగ్ మాఫియా గురించి గాని, సెజ్‌ల గురించి గానీ, గ్రీన్ హంట్‌లో ఆదివాసీల్ని అంతంచేస్తున్నపుడుగాని, సింగూర్, నందిగ్రాం ఉద్యమాలనుగాని, పోలవరం, నర్మదా డ్యాంలకు వ్యతిరేకంగా ప్రజాందోళనల్నిగాని పట్టించుకోని అన్నాజీ, రాలేగాం సిద్ధి చుట్టుపక్కల గ్రామాల్లో అందరి ఇళ్లలో సావర్కర్, ఫోటోలను పెట్టించే విప్లవాత్మక కార్యక్రమాన్ని, అమలుచేస్తూ అపర సంఘపరివార్ అనధికార సుప్రీంలా భారత రాజకీయ చిత్రపటం మీదికి అదాటుగా ఎలా వచ్చాడనేది అంత రహస్యమేమి కాదు.

జనలోక్‌పాల్ బిల్లు గురించి ప్రధానమంత్రిని బిల్లులో ఉంచాలా లేదా అన్నది అసలు సమస్యేనా? ఈ రోజు పి.యం.ఓ., సి.యం.ఓ., పార్లమెంటుని కూడా ప్రభావితం చేయగలిగే శక్తి కార్పొరేట్ సంస్థలకున్నదన్న విషయం అన్నాజీకి ఆయన భజన బృందానికి తెలియదా? భారత్‌లోనే మినీ భారత్‌లను సృష్టించుకుని, చట్టాల కతీతంగా దోపిడీ కొనసాగిస్తూ, అణు ఒప్పందంలో ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులకు ఒక్కొక్కరికి 30-40 కోట్ల రూపాయలు లంచంగా యిచ్చి ఇండియాని అమెరికాకు తాకట్టు పెట్టే బిల్లును నెగ్గించుకున్నప్పుడు అంత మొత్తం డబ్బుని ఏఏ కార్పొరేట్ శక్తులు సమకూర్చాయో ఈ గాంధేయ రుషికి తెలియదా? కిరణ్‌బేడి బెహన్‌జీకి, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కార్పొరేట్ డాక్టర్ ట్రెహన్‌లకు తెలియదా?

అన్నింటికన్నా ముఖ్యమైన రెండు విషయాలు ఆలోచించాల్సినవి.
(1) రెండు నెలల క్రితమే రామ్‌లీలా మైదానంలో సెప్టెంబర్ 1వ తారీకున బామ్‌సెఫ్ (బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్), ఒబిసి జనాభా లెక్కల విషయంలో జరుగుతున్న జాప్యానికి వ్యతిరేకంగా పెద్ద ర్యాలీని తలపెట్టి ప్రభుత్వ అనుమతి పొందింది. అదే రామ్‌లీలా మైదానాన్ని, అన్నాకు సెప్టెంబర్ 3 వరకు ప్రభుత్వం ఎందుకు అప్పగించింది? ఒబిసి సెన్సస్ విషయంలో అన్నా టీం స్పందన ఏమిటి?

(2) రామ్‌లీలా మైదానంలో రిజర్వేషన్ వ్యతిరేక నినాదాలు ఎందుకు, ఎవరిచ్చారు? గుజరాత్‌లో ముస్లిములను ఊచకోత కోసినపుడు మాట్లాడని అన్నాబృందం, మండల్ కమిషన్‌ని వ్యతిరేకించిన ఆధునిక మనువాదులు, వేదాంత, పోస్కోలాంటి మల్టీనేషన్ మైనింగ్ మాఫియాని వ్యతిరేకించని మినీభారత్ నిర్మాతలు, 'అవినీతి' అనే అంశాన్ని తీసుకొని కాషాయ కూటమికి అనుకూలంగా, మైనార్టీలకు వ్యతిరేకంగా ఒక సైన్యాన్ని ఎందుకు తయారుచేస్తున్నట్లు? రాజ్యాంగేతర వ్యవస్థని ఎందుకు కోరుతున్నట్లు? 80 కోట్ల జనాభా సమస్య ఆహార భద్రత విషయంలోను, ఆదివాసీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ఆపరేషన్ గ్రీన్‌హంట్ విషయాన్ని పట్టించుకోని అన్నాజీ, భారత ప్రజల మెస్సయ్య ఎలా అవుతాడు? తెలంగాణ యువకుల ప్రాణత్యాగాల్ని పట్టించుకోని ఈ దేశ మీడి యా, ప్రజల్ని మాస్ హిస్టీరీయోకెందుకు ఉసిగొల్పుతోంది.

అణచివేయబడుతున్న కులాలు, విద్యార్ధులు, మేధావులు ఆలోచించాలి!
అన్నాటీం ఈ అంశాలకు జవాబు చెప్పాల్సి ఉంది. (1) దేశంలో అవినీతికి పాల్పడుతున్నది ఏఏ వర్ణాలు / కులాలు? (2) స్విస్‌బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు దాచింది ఏఏ కులవర్గాలు? (3) నూటికి 90 శాతంగా ఉన్న శ్రామిక కులాలు అవినీతికి బాధ్యులా? లేక నూటికి 10 శాతంగా కూడాలేని దోపిడీ కులాలు అవినీతికి బాధ్యులా? (4) తమ చుట్టూ ఉన్న కార్పొరేట్ మీడియా, కార్పొరేట్ సంస్థలు, రాజకీయ నాయకులు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనటానికి అర్హులేనా? (5) మండల్ కమిషన్‌కి వ్యతిరేకంగా రిజర్వేషన్లకి వ్యతిరేకంగా నినదించిన ఈ గొంతులే కదా దొంగ, దొంగ అని అరుస్తున్నది. (6) ఒక అవినీతి సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, యింకో అవినీతి సామ్రాట్టు నినదించటంలోని రహస్యం అసలైన అవినీతి పరులు బయట పడకుండా ఉంచటానికేనా? అడాల్ఫ్ హిట్లర్ తాను యుద్ధంలో ఓడిపోతున్న విషయం రూఢి అయిన తర్వాత ఆత్మహత్యకు సిద్ధం అవుతాడు.

ఆ చివరి క్షణాలలో ఇంగ్లాండ్ ప్రీమియర్‌కు, అమెరికన్ ప్రెసిడెంట్‌కు ఒక వర్తమానం పంపుతాడు. ఆ వర్తమాన మేమంటే "నేను మీకు (పెట్టుబడి దారులకు) చేసే చివరి సేవ ఒక్కటే! మీరు ఇప్పటికైనా యుద్ధంలో చురుకుగా పాల్గొని కమ్యూనిస్టుల నుండి యూరప్‌ను రక్షించండి''. అన్నాజీ! 74 సంవత్సరాల వయస్సులో కూడా నమ్మిన మనువాద గాంధీ సిద్ధాంతానికి అంకితమై ప్రాణత్యాగానికి సిద్ధమైన మీ దీక్షా దక్షతలకు జోహార్లు! మీ వెన్నంటి ఉన్న అపర కుబేరులకు జేజేలు!! మీ దీక్షా దక్షతలను కనీసం 100 కోట్ల పౌరులకు బట్వాడా చేసిన కార్పొరేట్ మీడియాకు వేల వేల దండాలు!!!
- డా.యం.యఫ్. గోపీనాథ్

3 comments:

  1. అధికారం లో ఉన్నవారు తమకున్న అధికార బలంతో తమ అవినీతి,అక్రమ సంపాదనా మార్గాలకు చట్టభాద్దత కలిగిస్తారు.

    ReplyDelete
  2. we get somuch knowledge on this blog.
    https://goo.gl/Yqzsxr
    plz watch and subscribe our channel

    ReplyDelete
  3. GOOD BLOG AND ALSO PLEASE DO WATCH AND SUBSCRIBE TO :https://goo.gl/8LbUVk FOR INTERESTING UPDATES.

    ReplyDelete